బ్రేకింగ్ న్యూస్: అల్లాదుర్గ్ ::అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు . జోగిపేట :: మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 9000224866.

12, జనవరి 2013, శనివారం

రెండు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు






జోగిపేట : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలయ్యాయి. అందోల్ మండలం ఎర్రారం, కన్‌సాన్‌పల్లి గ్రామాల శివారులో ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఎస్‌ఐ అనిల్‌కుమార్ కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి నాందేడ్ వెళ్తున్న పత్తి లారీ, ఓ వ్యాను కన్‌సాన్‌పల్లి గ్రామ శివారులో శుక్రవారం అర్ధరాత్రి ఎదురెదురుగా ఢీకొన్నాయి. వ్యాను రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. 

అయితే లారీ వెనకాల వస్తున్న మరో లారీ ముందు లారీని ఢీకొట్టడంతో దాని ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ముందు ఢీకొన్న లారీ డ్రైవర్ సాహెబ్, క్లీనర్ ఫయాజ్ తీవ్రంగా గాయపడ్డారు. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి 108లో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం గాంధీకి తరలించారు. వీరు కడప జిల్లా దేవపట్ల గ్రామానికి చెందిన వారు. వ్యాను, మరో లారీ డ్రైవర్లు, క్లీనర్లు సైతం స్వల్పంగా గాయపడ్డారు. మూడు వాహనాలు ప్రమాదానికి గురి కావడంతో రాత్రి 12 గంటల నుంచి రహదారిపై ట్రాఫిక్ 15 కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. ఎస్‌ఐ అనిల్‌కుమార్ రెండు జేసీబీలను రప్పించి లారీలను తొలగించారు. వాహనాలను బోడ్మట్‌పల్లి చౌరస్తా నుంచి దారి మళ్లించారు. 

కారు, బైక్ ఢీ: ఇద్దరికి గాయాలు
కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. అల్లాదుర్గం మండలం పొతులబొగుడ గ్రామానికి చెందిన రవి, శివరాజ్ బైక్‌పై వెళ్తుండగా ఖేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరిని జోగిపేట ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు బైకులు ఢీ: ఒకరికి తీవ్ర గాయాలు
మనూరు: రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మనూరు మండలం ముక్టాపూర్ సబ్‌స్టేషన్ వద్ద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. బాదల్‌గాంకు చెందిన అశోక్ మోటారు సైకిల్‌పై నాగల్‌గిద్ద వైపు నుంచి నారాయణఖేడ్‌కు వస్తున్న క్రమంలో ఖేడ్ నుంచి నాగల్‌గిద్ద వైపునకు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అశోక్ తీవ్రంగా గాయపడడంతో అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అశోక్ కుమారుడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
సేకరణ : నందు 
                                                         www.jogipet.com