హైదరాబాద్: నగరంలోని దిల్ సుఖ్ నగర్ వద్ద మూడు వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 16 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. దిల్ సుఖ్ నగర్ లోని కోణార్క్,వెంకటాద్రి థియేటర్ల వద్ద పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పేలుళ్ల ప్రభావం కంటే తొక్కిసలాటలోనే ఎక్కువ మంది చనిపోయినట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోనే ఈ పేలుళ్లు చోటుచేసుకోవడం గమనార్హం.ఈ దుర్ఘటనలో పలువురు గాయపడ్డారు.భయంతో జనం పరుగులు తీసినట్టు సమాచారం. ఈ దుర్ఘటన సాయంత్రం 7గంటలకు చోటుచేసుకుంది. తొలి పేలుడు జరిగిన నిమిషం వ్యవధిలోనే మరో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. పేలుళ్లు చోటు చేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా జంటనగరాల్లో పలు ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. పేలుళ్ల సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి అంబులెన్సులు చేరుకున్నాయి. క్షతగాత్రులను ఉస్మానియా, ఓమ్నీ, మలక్‌పేట యశోదా ఆస్పత్రులకు తరలించారు. ఉస్మానియా లో 40 మంది, ఓమ్ని 18 , యశోదాలో 20 మంది క్షతగాత్రులను తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
|
|