www.jogipet.com :- ఈ ఉపాధ్యాయులు మాకొద్దు!

జోగిపేట, చింతకుంటల : గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తికి కొందరు మచ్చ తెస్తున్నారు. క్రమ శిక్షణ, విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే పిల్లలతో చెప్పించుకోవాల్సిన పరిస్థితి. ఉపాధ్యాయుల తీరును నిరసిస్తూ అందోల్ మండలం చింతకుంట ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు జోగిపేట- మెదక్ రహదారిపై సోమవారం గంటపాటు ఆందోళన చేశా రు. సీఐ విద్యార్థులను సముదాయించి ఆందోళన విరమింపజేశారు. విషయం తెలుసుకుని ఎంఈఓ గోపాల్ గ్రామానికి చేరుకుని పాఠశాలలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాలను విద్యార్థులు ఎంఈఓ దృష్టికి తెచ్చారు. పాఠశాలలో సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు రమేష్ జేబులోనే మద్యం సీసా పెట్టుకుని నిత్యం సేవిస్తూ ఉంటారని విద్యార్థులు ఆరోపించారు. ఇక ఉపాధ్యాయులు జ్యోత్స్న, ఇందిరల పనితీరుపైనా విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలకు సక్రమంగా రారని, వచ్చినా పాఠాలు బోధించరని పేర్కొన్నారు. విచారణలో భాగంగా ఎంఈఓ సదరు టీచర్లను పిలిచి విద్యార్థుల పేర్లను అడిగారు. పేర్లు చెప్పడంలో టీచర్లు తడబడ్డారు. ఇక ఇటీవల ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు తీసుకున్న సుభాష్‌చందర్ వారానికోమారు విధులకు హాజరవుతున్నట్లు విద్యార్థులు ముక్తకంఠంతో చెప్పారు. ఉపాధ్యాయుడు రమేష్, సుభాష్ చందర్‌లు ఒకరువస్తే మరొకరు రారని, హెచ్‌ఎం బాధ్యతలు వీరు మార్పిడి చేసుకుంటారని విచారణలో తేలింది.
నలుగురి ఉపాధ్యాయుల సస్పెన్షన్
చింతకుంట ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈఓ గోపాల్ తెలిపారు. విద్యార్థుల ఆందోళన అనంతరం వివరాలు సేకరించిన డీఈఓ పాఠశాల హెచ్‌ఎం సుభాష్ చందర్, స్కూల్ అసిస్టెంట్ రమేష్, ఎస్‌జీటీలు జ్యోత్స్న, ఇందిరలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.
|
|
|