ఏడుపాయలకు వెళ్లివచ్చే లోపు ఇల్లు గుల్లయింది. ఇరవై తులాల బంగారం, రూ.1.37 లక్షలు నగదు దొంగలు అపహరించారు. ఈ ఘటన ఆదివారం రాత్రి అందోల్ మండలం మాసాన్‌పల్లిలో చోటుచేసుకుంది. రాములుకు గ్రామంలో రెండు ఇళ్లు ఉన్నా యి. కుటుంబం మొత్తం కొత్త ఇంట్లో నివాసం ఉంటారు. కుమారుడు అశోక్, కోడలు రాణిలు రాత్రి సమయంలో పాత ఇంటికి వెళ్లి ఉంటారు. ఆదివారం వారు ఏడుపాయల వెళ్లి అక్కడే బసచేశారు.ఇదే అదునుగా భావించిన దొంగ లు పాత ఇంటి తలుపును తొలగించి లోపలికి చొరబడ్డారు. చిమ్మెట, ఇతర పరికరాలు ఉపయోగించి మూడు బీరువాలు ధ్వంసం చేశారు. అందులోని 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.1.37లక్షలు నగదు అపహరించారు.ఒంటరిగా ఉండే పొరుగింటి అంజమ్మ రాములు వద్ద దాచుకున్న 80 తులాల వెండి ఆభరణాలు, రెండు మాసాల బంగారు గజ్జెలు, కాన్పుకు వచ్చిన రాములు కూతురు కవితకు చెందిన 5.5 తులాల ఆభరణాలు, ఇతర ఆభరణాలు అపహరించారు. రాములు ఇటీవల చెరకు అమ్మగా వచ్చిన డబ్బులు, ఎడ్లను అమ్మగా వచ్చిన మొత్తం డబ్బు రూ.1.37వేలు ఇంటిలోనే దాచిపెట్టారు. అవి కూడా చోరీ అయ్యాయి. మొత్తం సుమారు రూ.7.50 లక్షల సొత్తు అపహరణకు గురైంది. విషయం తెలిసిన వెంటనే క్లూస్‌టీం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. జాగిలాలు వచ్చి ఇంటి నుంచి అందోల్ చెరువు వరకు వెళ్లి తిరిగి గ్రామంలోకి చేరుకున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.