బ్రేకింగ్ న్యూస్: అల్లాదుర్గ్ ::అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ఓ పూరిగుడిసె దగ్ధమైంది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు . జోగిపేట :: మీకు ఏదైనా సమాచారం తెలిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి 9000224866.

11, మార్చి 2013, సోమవారం

ఏడుపాయల జాతర - బోనాల ఊరేగింపుతో సందడే సందడి



మహాశివరాత్రి పుణ్యదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఏడుపాయల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఎల్లలు దాటి తరలివచ్చిన భక్త జనాలతో ఏడుపాయల జనారణ్యంగా మారింది. ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుటుంబసమేతంగా తరలివచ్చి, అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి జాతర ప్రారంభించారు. జిల్లా అధికార యంత్రాంగం జాతరలో మకాంవేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతుండగా, పోలీసులు మెటల్ డిటెక్టర్లతో భక్తులను తనిఖీ చేసి దుర్గమ్మతల్లి దర్శనానికి అనుమతించారు. ప్రత్యేకపోలీసు బలగాలతో అధునాతన టెక్నాలాజిని ఉపయోగించుకుంటూ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. 




తెలంగాణ లో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల జాతరకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ జిల్లాల నుంచి భక్తులు లారీలు, బస్సులు, డీసీఎంలు, వ్యాన్, కార్లు, ట్రాక్టర్లు, ఆటోల్లో పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంజీరా బ్యారేజీ నుంచి ఈ నెల 6న వదిలిన నీరు ఆదివారం తెల్లవారుజామున ఘణపురం ప్రాజెక్ట్‌కు చేరుకుంది. వేలాది భక్తులు ఆనకట్ట దిగువ భాగాన, చెక్‌డ్యాంలో, అమ్మవారి ఆలయం ముందుగల మంజీరా నదిలో స్నానాలు చేసి దుర్గమ్మతల్లిని దర్శించుకొని శివ దీక్షలు చేపట్టారు. క్యూలైన్లు క్రమపద్ధతి ప్రకారం ఏర్పాటు చేయడంతో దర్శనం కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సేవల నిర్వహణపై అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించారు. 

ఏర్పాట్ల పర్యవేక్షణలో అధికారులు
 జాతరను జయప్రదం చేసేందుకు జిల్లాలోని 30 శాఖలకు చెందిన అధికారులంతా ఏడుపాయలలోనే మకాం వేశారు. కలెక్టర్ దినకర్‌బాబు సతీసమేతంగా ఏడుపాయలకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని, జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్, సబ్ కలెక్టర్ భారతి హొళ్లికేరి, అడిషనల్ ఎస్పీ భూపాల్, ట్రెయినీ ఎస్పీ బబ్లూ ఆదిత్, డీఎస్పీ గోద్రూ జాతరలో పూర్తిస్థాయి పర్యవేక్షణ చేస్తున్నారు. ఈసారి మొదటిసారిగా రాజగోపురం, అమ్మవారి ఆలయం వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి భక్తులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన అనంతరమే లోనికి పంపిస్తున్నారు. వాహనాల పార్కింగ్, నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తుండటంతో జాతరలో ఎలాంటి ట్రాఫిక్ సమస్య తలెత్తలేదు. 

బోనాలు.. జెయింట్ వీల్స్.. టూరింగ్ టాకీస్‌ల సందడి
 దగ దగ మెరిసే పట్టు వస్త్రాలు ధరించి.. నెత్తిపై బోనాలు పెట్టుకొని.. ఓ చేతిలో వేపకొమ్మలు.. మరో చేతిలో చెర్నకోలలు పట్టుకొని డప్పుచప్పుళ్లకనుగుణంగా నృత్యాలు చేస్తూ కొనసాగే బోనాల ఊరేగింపు జాతరకే ప్రత్యేక ఆకర్శనగా నిలిచాయి. పట్టణాలు, పల్లెల నుంచి తరలివచ్చిన జనాలు జాతరలోని జాయింట్ వీల్స్ ఎక్కి, టూరింగ్ టాకీస్‌లలో సినిమాలు చూస్తూ ఆనందం పొందారు. ప్రజా సంబంధాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 
www.jogipet.com