కలెక్టరేట్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మీ సేవ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ దినకర్‌బాబు సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా ఈ గవర్నెన్స్ సొసైటీ నిర్వహించిన మీ సేవ వర్క్‌షాప్‌లో కలెక్టర్ మాట్లాడుతూ ‘మీ సేవ’ ద్వారా ప్రజలకు అత్యుత్తమైన సేవలందించడంలో జిల్లా ముందంజలో ఉందన్నారు. ల్యాండ్ రికార్‌డ్స అప్‌డేషన్‌లో జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. మీ సేవ ద్వారా ప్రజలకు సులభంగా, త్వరితగతిన సేవలందిస్తామన్నారు. మీ సేవలోని డేటా బేస్ మారుతున్న కాలానికి అనుగుణంగా పకడ్బందీగా మార్చాలని ఆయన సూచించారు. జిల్లాలో 149 మీ సేవ కేంద్రాల ద్వారా 5.60 లక్షల వివిధ రకాల ధ్రవపత్రాలను జారీ చేసినట్లు తెలిపారు.
ధ్రువ పత్రాల జారీలో ఆపరేటర్లు తప్పు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తహశీల్దార్లు ప్రతి వారం ఒక కేంద్రాన్ని తనిఖీ చేసి సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. డిజిటల్ కీ ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ శరత్ మాట్లాడుతూ జిల్లాలో మీ సేవ కేంద్రాల ద్వారా చదువుకున్న 1500 మంది యువతకు వివిధ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. మీ సేవ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించి ముందుకు తీసుకెళ్తున్న వారికి జేసీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం ఏపీ ఆన్‌లైన్ కీయోస్క్ ఆపరేటర్లకు గుర్తింపు కార్డులను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.
జిల్లాలో మీ సేవ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరిస్తున్న తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, మీ సేవ హ్యాండ్ హోల్డింగ్ పర్సన్స్‌కు, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు, సీనియర్ అసిస్టెంట్లకు, కంప్యూటర్ ఆపరేటర్లకు, టైపిస్టులకు, గ్రామ రెవెన్యూ అధికారులకు, ఏపీ ఆన్‌లైన్ కీయోస్క్ ఆపరేటర్లకు కలెక్టర్, జేసీ చేతుల మీదుగా మెమోంటోలు అందజేశారు. వర్క్‌షాప్‌లో డీఆర్వో ప్రకాశ్ కుమార్, మెదక్ సబ్ కలెక్టర్ భారతి, ఏపీ ఆన్‌లైన్ సీఈఓ కల్నల్, మీ సేవ జిల్లా నోడల్ అధికారి వీరారెడ్డి, డీఐఓ, ఎన్‌ఐసీ శాంతికుమార్, సంగారెడ్డి, సిద్దిపేట ఆర్డీఓలు రాంచందర్ రావు, నిఖిలా రెడ్డి, కలెక్టరేట్ ఏఓ నగేష్ తదితరులు పాల్గొన్నారు.
|
|